షిర్డీ
సాయి బోధనలను మన నిత్య జీవనంలో పాటించడం
అసలైన బాబా పూజ !!!
Following the Guru's Teachings in our daily life is Actual Pooja
నాలుకను
అదుపులో పెట్టుకున్నవాడు నారాయణునితో సమానుడు. ఆవేశం కలిగినప్పుడు సంయమనం (సహానుభూతి)
పాటించి మాటను పొదుపుగా వాడుకునేవాడు ధీమంతుడు. పరులను (ఇతరులను) భాధించేవిధంగా పలుకరాదు.
ఎదుటివారు దూషించిన భరించి, మౌనంగా సహించడమే ఉత్తముల లక్షణం. మాటకు మహత్తర శక్తి ఉన్నది
అది మంత్రంతో సమానమైనది. అందుకే వాక్కులను (మాటలను) పరిమితంగా వాడి, అసత్యమాడక, ఆదర్శ
జీవనం కొనసాగిస్తే అనిర్వచనీయ (వర్ణించలేనంత) దివ్యానందం లభిస్తుంది. ఏదంటే అది మాట్లాడక,
వ్యర్థ ప్రసంగాలు చేయక, వాదోపవాదాలతో కాలం వృధాపరచక, భగవానుని స్మరిస్తూ, భగవన్నామం
సంకీర్తన చేస్తూ పలుక గలిగినందుకు పరమార్థం ఇదేనని సత్యం గ్రహించి వర్తించాలని బాబా
ఉవాచ. దుర్భాషలు మాని ప్రియవచనం (మంచి మాటలు) పలకడమే అసలైన బాబా పూజ.....
ప్రతిచర్యకు
ప్రతిచర్య (ప్రతిక్రియ) ఉన్నట్లే మానవులు చేసే మంచి పనికి సత్పలితం (మంచి ఫలితం), చెడు
కార్యాలకు దుష్పలితం (చెడు ఫలితం) అనుభవించక తప్పదని బాబా పునరుద్ధటించారు. సత్ప్రవర్తన,
సన్మార్గాలు, సజ్జన (మంచివాళ్ళు) సాంగత్యము ఎంత ముఖ్యమో వివరించారు. అందరి ఎడల ప్రేమతో
ప్రవర్తించాలి, ఇతరులను నొప్పించక జీవితం సాగించాలి, శత్రువునైనా సరే హింసించిక, ప్రేమతో
పరివర్తన తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాలి, సోమారిపోతులై ఉండక ఎప్పుడూ సత్కార్యాలను
అనుసరిస్తూ, అదే దైవకార్యంగా భావించాలి. దానధర్మాలు చేస్తూ, ధర్మపథంలో సంచరిస్తూ, దుష్కర్మలు
నివారిస్తూ భగవన్నామం సంకీర్తన చేస్తూ మానవత్వం పెంపొందించి బ్రతుకు సాగించేవారికి
భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. ఇదే సాయి బోధన,... ఇదే సత్య భావన...
సాయి బోధనలలో అత్యంత ప్రధానమైనది విశ్వాసము.
భగవంతునిపై
నమ్మకమే భక్తునికి ఉఛ్వాసము, మంచిగాని, చెడుగాని భారమతడేనని విశ్వసించి సంపూర్ణ శరణాగతితో
సర్వం అర్పించినవారిని సంరక్షించడమే సాయి మతం, అభిమతం, ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే
గురువుపై అచంచలమైన నమ్మకముండాలి. అతడు చూపే బాటపై గౌరవం, అతడు చెప్పే మాటపై విశ్వాసంకలిగి
పయనిస్తే మార్గం సుగమమౌతుంది గమ్యం చేరువౌతుంది. గురువుని గురుతించాలి, అది గురుతరభాధ్యతగా
గ్రహించాలి, సందేహాలు, సంశయాలు ఆవలపెట్టి (దూరం) అతడు నిర్దేశించిన పధము అనుసరించాలి.
ఈ దృఢవిశ్వాసమే సంకల్పానికి ప్రాతిపదిక. సాయి బోధనలు అనుసరించడమే లక్ష్యసిద్ధికి దివ్యసూచిక.
ఇది
'సబూరీ' గా సుప్రసిద్ధం. అచంచల విశ్వాసంతో, శ్రద్ధాసక్తులతో సాయి భక్తులు సహనం అలవరచుకుంటే
శ్రేయదాయకం. ప్రారంభంలో కొంచెం కష్టంగా అనిపించినా ఈ ఓర్పు వలన కలిగే ఓదార్పు అపారం,
అసమానం. మనిషికి సహనమే మహాశక్తి, మనసుకెంతో ప్రశాంతి, ఇతరులు దూషించిన, ఇక్కట్లకు గురిచేసినా,
నిరాశా నిస్పృహలు కలిగినా, ఆపదులు ఎదురైనా, అనుకోని పరిస్థితులు చుట్టుముట్టినా అన్నింటికీ
ఉపశమనం ఈ సహనం. ఇది ఆత్మబలానికి ఆవాహనం. శరీరానికి తగిలినా, మనసుకు కలిగినా, భాధ ఒక్కటే.
ఊరట కలుగుతుంది, సైరించగలిగితే, భరించగలిగితే బాధనుండి సంతోషం పుడుతుంది. సహించగలిగితే
వేదన నుండి వేదన ఉదయిస్తుంది. దేనికైనా తట్టుకున్నప్పుడే దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
చిరునవ్వుతో స్వీకరిస్తే, చేదునుండి అమృతం ఆవిర్భవిస్తుంది.
భగవానుని సాక్షాత్కారం పొందేందుకు జ్ఞానయోగం,
కర్మయోగం ఉన్నప్పటికీ భక్తి మార్గమే సులభమైనది.
పరమాత్ముని పై ప్రేమే భక్తి. ఏవిధమైన స్వార్థచింతన లేక భౌతికాపేక్ష రహిత ప్రేమే అసలైన భక్తి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి నవవిధ భక్తి మార్గాలు. వీటిలో దేనిని అనుసరించినా, అవలంభించినా మోక్షం కలుగుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా పరమాత్ముడే సర్వమని భావించి శరణు వేడితే సామాన్యులకు కూడా పరమపదం సంప్రాప్తిస్తుంది. సాధన లేక సాయుజ్యం భక్తి ద్వారా సాధించవచ్చునని, కైవల్యానికి ఇదే సోపానమని, సాయి సచ్చరిత్ర అధ్యయనం చేస్తే విదితమౌతుంది. అనేక సందర్బాలలో ఈ విషయాన్నే బాబా నొక్కి వక్కాణించారు (ప్రతిపాదించారు).
జై సాయి రాధే గోవిందా
ప్రేమతో జపించండి:
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఆనందించండి.
మీ మురళి సాయి
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఆనందించండి.
మీ మురళి సాయి
No comments:
Post a Comment