Friday, 9 December 2016

Gitopadesham in Telugu - Conversation between Krishna-Arjuna.



భగవద్గీత ఉపదేశాలు




మాటీవీ తెలుగులో ప్రసారం చేసిన భగవద్గీత సీరియల్ అందరూ చూసే ఉంటారు అందులో ముఖ్యమైన భాగం అర్జునుడు ఇంకా కృష్ణ భగవానుడి మధ్య జరిగిన సంభాషణ 'గీతోపదేశం' ఆ కృష్ణ భగవానుని సందేశం కేవలం అర్జునుడికి మాత్రమే కాదు. మనలాంటి సామాన్యులు తెలుసుకుని ధర్మ మార్గంలో పయనించడం కొరకు చెప్పారు. ఇక అర్జునుడు అడిగిన ప్రశ్నలు సందేహాలు మనలో చాల మందికి కలిగే సామాన్యమైన సందేహాలు. వాటన్నిటికీ భగవాన్ శ్రీ  కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పారో ఒక్క సారి చూస్తే, వింటే అర్ధమయ్యేది కాదు. అందుకుగాను నేను పూర్తి సంభాషణను ఇలా మీ ముందుకు తీస్కొచ్ఛే ప్రయత్నం చేశాను. మీకు నచ్చితే దయచేసి మీ నిత్య జీవనంలో పాటించండి. మీ కామెంట్స్ తో ఎంకరేజ్ చేయండి. 

ప్రారంభించిన తేదీ: 16-07-2016 ఆషాడ, శుక్ల పక్ష, ద్వాదశి. శనివారం. విశేషం: తిరుమల ఆణివార ఆస్థానం

ముగించిన తేదీ: 21-07-2016 ఆషాడ, కృష్ణ పక్ష, ద్వితీయ. గురువారం



ఇక ఇప్పుడు మహాభారత సంభాషణలోకి,.. అందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు


ఓం నమో భగవతే వాసుదేవాయ
 
అర్జున: మాధవ,,,, మాధవ నేను శంఖాన్ని పూరించక ముందే ఇరు పక్షాల సైన్యాన్ని కళ్లారా దర్శించుకోవాలనుకుంటున్నాను. రథాన్ని ఇరు సైన్యాల మధ్యకు తీసుకు వెళ్ళండి.

కృష్ణ భగవాన్: ఏం దర్శిస్తావు పార్థ? నీవు పక్షి కంటికి గురి పెట్టినప్పుడు వృక్ష శాఖ కూడా నీకు కనిపించదు, కానీ ఈరోజు, ఈ సమయంలో సమస్త రణభూమిని ఎందుకు దర్శించుకుకోవాలనుకుంటున్నావు? 

అర్జున: ప్రతిపక్ష సేనను పరీక్షించాలనుకుంటున్నాను మాధవ, మన సేనను కూడా ఒకసారి చూడాలనివుంది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ యుద్ధంలో ఎవరి మరణం వలన ధర్మ సంస్థాపన జరుగుతుందో, ఎవరి మరణం వలన అధర్మం అనుభవంలోకి వస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మహాయుద్ధంలో నేనేమి పొందనున్నానో దేనిని కోల్పోనున్నానో అని. 

కృష్ణ భగవాన్: ఈ యుద్ధంలో బలిదానం ఇచ్చేందుకు వచ్చావు పార్థ. ఇక లాభ నష్టాల గురుంచి ఎందుకు ఆలోచిస్తావు పార్థ, దానం ఇవ్వడమంటె ఏమిటంటే దాత కోల్పోతాడు, యాచకుడు లాభాన్ని పొందుతాడు. కానీ బలిదానం ఇవ్వడమంటె, దాత దానం చేస్తే యావత్ లోకం లాభం పొందుతుంది.

అర్జున: కానీ మాధవ, నేనొక్కడినే దానం చేసేందుకు ఇక్కడికి రాలేదు. ఎందరో సైనికులు తమ ప్రాణాలను ఆహుతి చేసేందుకు వచ్చారు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ మహాయుద్ధంలో నేను కేవలం అధర్మాన్ని నాశనం చేస్తున్నానా లేక దానితో ధర్మాన్ని సహా నాశనం చేస్తున్నానా అని.

కృష్ణ భగవాన్: ఐతే ఇదంతా నీవలన జరుగుతుందా పార్థ? నిర్మాణ వినాశక శక్తులున్నాయా నీకు పార్థ? నిర్మాణ వినాశక కార్యాలను స్వయంగా ఆ ఈశ్వరుడే చేస్తాడు పార్థ. నీవు కేవలం ఒక సాధనానివి

కృష్ణ భగవాన్: మరెందుకు ఈ విషయాల బాధ్యతను నువ్వు నీ శిరస్సుపై వేసుకుని అహంకారాన్ని పెంచుకుంటున్నావు? నేను నీకు ముందే చెప్పాను పార్థ. "స్వయంగా తాను చేస్తున్నది ఏమి లేదని" ఎవరైతే తెలుసుకుంటారో వాని చేతులమీదగానే ఏదైనా మహత్ కార్యం జరగుతుంది. కానీ బహుశః నువ్వు మరచి ఉంటావు. ఐతే దర్శించు పార్థ, దర్శించు ఏమి దర్శించుకోవాలనుకుంటున్నావో, కానీ ఒకవేళ దానం చేసేముందు ఆ దాత చేయి కంపించినట్లైతే వానికి ఆ దానం చేసిన పుణ్యం ప్రాప్తించదు పార్థ.

ధర్మో రక్షతి రక్షితః!!!

కృష్ణ భగవాన్: ఇక్కడ యువరాజు దుర్యోధనుడున్నాడు. జ్ఞాపకం చేస్కో పార్థ, పాంచాలిని దాసిగా మార్చి ద్యుతసభకు ఈడ్చుకు రమ్మని ఆదేశం ఇచ్చినది ఈ దుర్యోధనుడే. ఇటు చూడు పార్థ ఇతనే మీ మేనమామ శకుని. నేడు వీడి చేతిలో కరవాలం ఉంది. కానీ వంచనతోనే సంహరించాలని ప్రయత్నిస్తుంటాడు సదా. స్మృతికి తెచ్చుకో ఇతను ఏ విధంగా మీ పంచపాండవులను మీ మాతను వారణావతంలో భస్మం చేయాలని పధకం వేసాడో..!
ఇటు చూడు పార్థ, దుశ్యాసనుడు, ఈ చేతులతోనే పాంచాలి కేశాలని పట్టి ఈడ్చే దుసాహసం చేస్యాడు. మహితాత్ములు, గురు ద్రోణలును చూడు. మౌనంగా ఉండి పాంచాలికి పరాభవం చేయించారు. అక్కడున్న అశ్వథామును చూడు. జ్ఞాపకం చేస్కో, ఎటువంటి అపశబ్దాలను ప్రయోగించాడో వాడు ఆనాడు. ఇప్పటికి నీ మనస్సు ప్రతీకారంతో జ్వలించడం లేదా పార్థ? ఇప్పటికైనా నీ మనసు న్యాయంకోసం తపించడం లేదా? ఇప్పటికి శాస్త్రాన్ని సాధించాలన్న సంకల్పం కలగడం లేదా నీ మనసులో? ఇక ఇప్పుడు యుద్ధం అనివార్యం అనిపించడం లేదా? 

అర్జున: అవును మాధవ,... ఈ యుద్ధం అనివార్యమే !!!

కృష్ణ భగవాన్: ఇప్పుడు ఈ యుద్ధం నీవు అనివార్యం అంటున్నావు?
ఐతే మహితాత్ముని మళ్ళీ ఒకసారి చూడు పార్థ, చూసి జ్ఞాపకం చేస్కో అడుగడుగునా ఎలా వారు ప్రేమ, రక్షణ కల్పించారో, స్వయంగా తాను బలిదానం ఇచ్చి నీకు నీ కుటుంబానికి అధికారాన్ని ఇప్పించాలని ప్రయత్నించారు. ఒకమారు మళ్ళీ గురు ద్రోణుని చూడు, చూసి జ్ఞాపకం చేస్కో ఎంత గర్వంతో, ప్రేమతో గురువుగా వారు నీకు తమ జ్ఞాన సంపదను ఇచ్చారు. నిన్ను విశ్వంలో శ్రేష్ఠ ధనుర్ధారిని చేసేందుకు తమ భుజాలపై పాపభారాన్ని మోస్తున్నారు. స్మృతికి తెచ్చుకో పార్థ. ఇక అటువైపు వికర్ణుని కూడా చూడు కేవలం తనొక్కడే నాడు ద్యుత సభలో అన్యాయాన్ని ఎదురించే సాహసం చేస్యాడు. వీరందరూ వధించదగినవార పార్థ?

అర్జున: లేదు మాధవ, వీరిని నేనెలా వధించగలను?

కృష్ణ భగవాన్: అవశ్యం... కానీ స్వపక్షాన్ని కూడా చూడు పార్థ.
ఇప్పుడు నీ పక్షాని కూడా చూడు పార్థ. మీ అగ్రజుడు యుధిష్ఠిరుడు, సోదరుడు భీముడు, నీ అనుజులను చూడు, నీ పుత్రులను నీ సోదర పుత్రులను చూడు. వీరిలో అనేకులు మృతి చెందుతారు. ఈ యుద్ధంలో వీరందరూ మరణించే అవకాశం ఉందని తెలిసి నీ హృదయం కంపించడం లేదా పార్థ? ఇప్పుడు ఒక విషయం ఆలోచించు భావ దుర్యోధుని దోషం ఏముంది? ఒకవేళ వానికి రాజ్యకాంక్ష అనేది ఉంటే వాని మాత ముందుగా గర్భం ధరించిన విషయం సత్యం. దుశ్యాసనుడు పాంచాలిని వివస్త్రను చేయజూసి అపరాధం చేసాడు. ఒకవేళ అది అపరాధం ఐతే నీవు కూడా నీ అగ్రజుని మాటను మన్నించి నీ భార్యకు అవమానం జరుగనిచ్చావు. ఐతే అది అపరాధం కాదా? మహితాత్ములు తన ప్రతిజ్ఞ ఎక్కువ ముఖ్యం అని భావించారు, తమ కులవధువు గౌరవానికి తక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. ఐతే అది అధర్మం కాదా? నీ జ్యేష్ఠ సోదరుడు యుధిష్ఠిరుడు తాను నమ్మినటువంటి ధర్మాన్ని నిర్వర్థించేందుకు నాడు ద్యుత సభలో పాల్గొన్నాడు.

ఐతే అది అధర్మం కాదా? ఇంత విన్నాక భావ దుర్యోధునుని శత్రువుగా భావించడం ఉచితమేనా? నీకు మీ పక్షాన ధర్మం కనిపిస్తున్నదా పార్థ?

అర్జున: నా మతి మందగించింది మాధవ... అణువణువు కంపిస్తుంది. ఇప్పుడు నా చేతులలో శస్త్రాన్నీ ఎత్తే శక్తి లేదు. నా గాండీవం,,, నా గాండీవం చేతినుండి జారిపోతుంది మాధవ. నాకు కేవలం భయానక వినాశనమే కనిపిస్తుంది. కేవలం భయానక వినాశనం... ఎందుకు? ఎందువలన మాధవ, ఎందువలన? అవమాన భారం, అన్యాయం గురుంచి ఆలోచన లేదా ప్రతీకార సంకల్పం ఇలాంటి ఏ కారణం లేదు నాకిప్పుడు. నాకిప్పుడు కారణం లేదు మాధవ. ఇంతటి మహా విధ్వంసాన్ని నేను స్వీకరించేందుకు... వద్దు మాధవ...!

కృష్ణ భగవాన్: విధ్వంసమే నవనిర్మాణానికి కారణం పార్థ... మొక్కకున్న ఒక శాకను ఖండిస్తే రెండు శాకలు ఉద్భవిస్తాయి. నువ్వు నేటి విధ్వంసానికి ఎందుకు భయ పడుతున్నావు? రేపు మళ్ళీ నవ నిర్మాణం జరిగి తీరుతుందన్న సత్యాన్ని నీవు ఎరుగవ? 


| క్లైభ్యం మహాస్వగన పార్థ నహితత్వ యుపపద్యతే | 

ఈ నపుంకసత్వం నీకు శోభించదు అని గుర్తించు. యుద్ధం చేయడమే నీ కర్తవ్యం పార్థ. శస్త్రాన్ని సందించు...

||నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం, దేవిం సరస్వతీమ్ వ్యాసం తతోజయం ఉదీరయేత్||

అర్జున: నా ఆత్మకు సారథిగా మారి, నా జీవిత రథాన్ని ఉచిత మార్గంలో నడిపించండి మాధవ. నేను ఏమి తెలుసుకుంటే నా దౌర్భల్యాన్ని వదలి పెట్టగలనో చెప్పండి.

కృష్ణ భగవాన్: లే పార్థ... శ్రద్ధగా విను, జీవిత రహస్యాన్ని తెలుసుకో, లోకంయొక్క వాస్తవిక రూపాన్ని అర్ధం చేస్కో. గంగా ప్రవాహంలో పిడికిలిని ముంచి తీసియనతో నీకు ఏది ప్రాప్తించదు. కానీ అర చేతులతో దోసిలిపట్టి గంగా ప్రవాహంలో ముంచితే ఆ గంగాజలంతో నీ జీవితం పావనం అవుతుంది.

పరబ్రహ్మ విభజన చెంది, పురుషుడు, ప్రకృతి ఉద్భవించాయి. అప్పుడు పురుషుడు అంటే పరమాత్ముని అంశ ఆత్మగా మారి ప్రకృతిలోని ప్రతి వస్తువులోను నివసించడం జరిగింది. ఆ ఆత్మను మొహం, అంధకారం ఆవరించాయి పార్థ. ఆ మోహ నిద్రనుంచి జాగృతమై తనను తాను పరమాత్ముని అంశగా తెలుసుకోవడమే ఆత్మయొక్క కర్తవ్యం, ఉద్దేశం. అదే జీవన కార్యం.

అర్జున: కానీ మాధవ ఒకవేళ ప్రతి ఆత్మ పరమాత్ముని అంశ ఐతే మరి ఉన్నతి, అధోగతి స్వయంగా పరమాత్మ చేస్తున్నాడా?

కృష్ణ భగవాన్: బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో అదే విధంగా ప్రకృతిలోని 24 పదార్థాలనుండి వేరైనా ఆత్మ ఒక పరమాత్ముని అంశ అనే సత్యాన్ని విస్మరిస్తుంది. ఆత్మలు ఎక్కువ శాతం తమ దేహాన్ని సర్వస్వంగా భావిస్తాయి. తాము దేహానికి భిన్నమని, అవి తెలుసుకోలేక పోతాయి. శరీరానికి కలిగే సుఖం, దుఃఖం, రుచి, వాసన ఇత్యాది అనుభవాలను అది తమ అనుభవాలని భావిస్తుంటాయి. అసలు మార్పుకోసం ప్రయత్నం కూడా చేయవు... ఇలా మార్పుకోసం ప్రయత్నం కూడా చేయలేని ఆత్మలు నిరంతరం అధర్మం చేస్తూనే ఉంటాయి వాటిని జాగృతం చేసేందుకు దండన విధించడం అనివార్యం. నీవు ఇది తెలుసుకో పార్థ, నీవు శరీరానివి కాదు. కేవలం ఒక ఆత్మవు! ఈ రణభూమిలో కనిపిస్తున్న ప్రతి ఒక్క యోధుడు వాస్తవానికి నీవు అనుకుంటున్నవారు కాదు. కొంతకాలం పాటు వీరందరూ శరీరాల్లో వాసం చేస్తున్నవారు. వీరి శరీరాలు మరణిస్తాయి కానీ వీరందరు అమరులు. వీరు మళ్ళీ నూతన శరీరాలు ధరిస్తారు. తాము ఆత్మ స్వరూపులు అని తెలుసుకునే వరుకు.

తమ అధర్మాన్ని త్యజించి, ధర్మ మార్గానికి వచ్చేంతవరుకు వీరందురు ఇలా జన్మిస్తుంటారు. అలాగే మరణిస్తుంటారు. ఇదే బ్రహ్మవిద్య బోధించే ప్రథమ పాఠం పార్థ. జన్మించిన వారికి మరణం అనివార్యం. అలాగే మరణించినవారు అవశ్యం మళ్ళీ జన్మిస్తారు. ఈ మహాజ్ఞానాన్ని సాంఖ్యాయోగం అంటారు.

అర్జున: ధర్మం, అధర్మం అంటే ఏమిటి మాధవ?

కృష్ణ భగవాన్: ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తాను ఆత్మ స్వరూపుడని గుర్తిస్తాడో, పరమాత్ముని అంశగా ఉద్భవించానని తాను తెలుసుకుంటాడో ఆ మార్గానే ధర్మమని అంటారు. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్ముని స్వరూపంగా అర్ధం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మ అని పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం కాగలదు. సృష్టికి, పరమాత్మకు ఏ బేధము లేదు. ఏ మనిషైతే ఇది తెలుసుకుంటాడో వాడు ఇతర మనుషులు, ప్రాణుల పట్ల నిర్దయ, కాఠిణ్యం వహించడు. వానికి ఇది తెలుసు జిహ్వను ఖండిస్తే భాధ కేవలం జిహ్వకె ఉండదు దాని అనుభూతి శరీరమంతటికి ఉంటుంది. అదే విధంగా ఒక మనిషికి భాధ కలిగితే సమస్త లోకము ఆ భాధను అనుభవించి తీరుతుంది. ఈ లోకంలో ఏ ఒక్క మనిషి భాధను అనుభవిస్తున్న ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేరు. కరుణతో నిండిన మనస్సు ఏ కార్యం ఐతే చేయాలనుకుంటుందో దానినే ధర్మము అంటారు. 

అర్జున: అంటే అధర్మం అనేది అజ్ఞానానికి మారు పేరా? ఐతే అజ్ఞానుల పట్ల దయ చూపడం అవసరం కదా! దండించడంలో అర్ధం ఏమిటి?

కృష్ణ భగవాన్: అజ్ఞాని జ్ఞానం విలువను తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే జ్ఞానం వైపు దృష్టి సారించేందుకు సిద్ధంగా లేకుంటే అప్పుడు దండనే దయ అవుతుంది. వాని పట్లనే కాదు ఇతరుల పట్ల కూడా అవుతుంది. సృష్టిగతి సదా పరమాత్మవైపే ఉంటుంది, ఇది అనివార్యం, కాని అప్పుడప్పుడు ఒక దుఃస్థితి ఉత్పన్నమవుతుంది. అజ్ఞానం, మొహం, అధర్మం పెరిగిపోతుంటాయి. లోకంలో ధర్మం లుక్తమవుతుందన్న భయం ఉత్పన్నమవుతుంది. లోకంలో ధర్మం లుక్తం అయిపోయినప్పుడు కరుణ నశించిపోతుంది. అదే విధంగా సత్యం కూడా నశించిపోతుంది. రానున్న తరాలకు ధర్మం ప్రాప్తించాలంటే ఈరోజు అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించండం అనివార్యం పార్థ. ఈ పరిస్థితి అటువంటిదే పార్థ, ఇక ధర్మ సంస్థాపన చేసే కర్తవ్యం కేవలం నీదే కనుక దౌర్భల్యాన్ని త్యజించు. ఇకనైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండు.

అర్జున: మరి నా చేతులలో హత్యలు జరుగుతాయి మాధవ. నా కారణంగా ఇంకొకరి ప్రాణాలు పోతే నాలో ఉన్న కరుణ నశించినట్లు కాదా మాధవ, ఐనా ఒకవేళ ధర్మానికి ఆధారం కరుణ ఐతే మరి నా ఆత్మకు కర్మ బంధం ఏర్పడదా? 

కృష్ణ భగవాన్: కర్మబంధం అనేది అవశ్యం ఏర్పడుతుంది. కాని కార్యబంధం ఏర్పడే అవకాశం లేదు పార్థ. నీవు కర్మకు, కార్యానికి మధ్య ఉన్న బేధమేమిటో తెలుసుకోవడం అవసరం. అన్ని కర్మలు కార్యాలే, కాని అన్ని కార్యాలు కర్మలు కావు. కర్మ అనే కార్యం ఏమిటంటే దానికి ఫలితం అనే ఆశ తోడై ఉంటుంది. మనిషి ఎప్పుడు సుఖానికై, సంపదకై, ప్రశంసకు గనుక ఆశించి ఒక కార్యం చేస్తే వాడు ఆ కార్య ఫలితానికి బద్ధుడౌతాడు. ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించి చేస్తారో దానిని సకామ కర్మ అంటారు. ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించక చేస్తారో దానిని నిష్కామ కర్మయోగం అంటారు. ఈ కారణంగానే మనిషి మళ్ళీ మళ్ళీ జన్మించవలిసి వస్తుంది. మనిషిని ఏ కర్మ బంధించదు. ఆ కర్మకు తోడైన ఆశలే బంధిస్తాయి.

అర్జున: ఏ విధంగా మాధవా?

కృష్ణ భగవాన్: ఈ యుద్ధంలో గెలవాలన్న కోరిక నీకుంటే అందులో పరాజితుడవైతే నీకు దుర్భరమైన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం నీ చేత ఇతర కార్యాలు చేయిస్తుంది. దానివలన నువ్వు మళ్ళీ జన్మించవలిసి వస్తుంది. యుద్ధంలో విజయుడవైతే నీలో అహంకారం పెరుగుతుంది, ఆ అహంకారం నెన్ని విశ్వవిజేతవుకమ్మని ప్రేరేపిస్తుంది. నీ చేత హత్యలు చేయిస్తుంది. ఆ పాపం నిన్ను బంధిస్తుంది. ఆలోచించు ఒకవేళ నీకు ఈ యుద్ధం పట్ల విజయానికై మొహంగాన్ని పరాజయ భయంగాన్ని లేకుంటే, ఈ యుద్ధం పూర్తయ్యాక నీకు సుఖం ప్రాప్తిస్తుందా? లేదా దుఃఖం ప్రాప్తిస్తుందా?

అర్జున: సుఖం కాదు మాధవా,,, దుఃఖం కూడా కాదు.

కృష్ణ భగవాన్: అంటే నీకు లభించే సుఖం, దుఃఖం, ఆవేదన, నిరాశ, అహంకారాలకు యుద్ధం కారణం కాదు. యుద్ధంపట్ల నీ మనస్సును ఎన్నో ఆశలు చుట్టుముట్టి ఉన్నాయి. అదే కారణం! నేనంటున్నది సత్యం కాదంటావా పార్థ?

అర్జున: Hmm...

కృష్ణ భగవాన్:
|సుఖదుఃఖే సమెకృత్వ, లాభాలాభౌ జయాజయో. తథా యుద్ధయా యుద్ధస్వ, నైవం పాప మవాప్యసి|
అంటే సుఖదుఃఖాలను సమానంగ భావించి, లాభం, హాని, జయాపజయాల గురించి ఆలోచించకుండా నువ్వు యుద్ధం చేస్తే కౌంతేయా..... నీవప్పుడు పాపంలో భాగస్తుడువు కాబోవు. దీనినే కర్మయోగం అంటారు.

అర్జున: కాని మాధవ, ఒకవేళ కార్యబంధం నిశ్చితమౌతే లౌకిక జీవితాన్ని విడిచి సన్యాసం తీస్కోవడం ఉచితం కాదా?  

కృష్ణ భగవాన్: ఈ ఆలోచన పరివసానంగానే ఈరోజున ఈ యుద్ధం జరగుతుంది పార్థ. ఆలోచించు ఎప్పుడైతే సత్వగుణం కలిగి. ధర్మాన్ని తెలుసుకున్నవారు కర్మలను త్యాగం చేస్తారో అప్పుడు అధర్మ మనస్కులైనవారే ఈ లోకంలో రాజ్యం చేస్తారు. ఒకవేళ మహితాత్ములు లౌకిక జీవితాన్ని త్యజించివుండకుంటే ఈరోజు అధర్మం ఇంతగా పెరిగి ఉండేది కాదు. అలాగే మీ పితృదేవులు ఆ నాడు సన్యసించి ఉండకుంటే ఈరోజు భావ యుధిష్ఠిరుడు సుఖంగా రాజ్యం చేస్తుండేవాడు. అలాగే తన ప్రజలకు న్యాయం ధర్మంగురుంచిన జ్ఞానాన్ని అందించేవాడు. కాని బాధాకరమైన విషయమేమిటంటే సత్వగుణం నిండినవారే లోకానికి లాభం చేకోర్చగలరు, కాని వారే సన్యసించాలని ఆలోచిస్తారు. జలం భాష్పంగా మారి ఆకాశానికి చేరుతుంది ఇక బురద, బురద అక్కడే పడివుంటుంది. అలాగే సత్వగుణంగల సజ్జనులు లోకాన్ని త్యాగం చేస్తుంటారు ఇక తమస్సులో ఉన్న ఉన్న అధర్మపరులు లోకంలోని కార్యాలు చేస్తుంటారు. ఈ కారణంగానే ఈ లోకంలో పాపం, అధర్మం పెరుగుతుంటాయి. కాని కర్మయోగి యావత్ లోకానికి రక్షణ కల్పిస్తుంటాడు, కర్మయోగి కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తాడు. కాని కర్మలను త్యాగం చేయడు. వాడు ఈ లోకంలోనే ఉంటాడు సన్యాసి మాదిరిగ. అన్ని కార్యాలను చేస్తుంటాడు కాని వానిలో అపేక్ష ఉండదు. కర్మయోగికి తన సంతానంనుండి, స్వజనలనుండి, తన ప్రజలనుండి ఎటువంటి ఆపేక్షగానీ, ఆశగాని ఉండవు. స్వయంగా ఒక సన్యాసి మాదిరిగ లాభం చేకోర్చుతాడు.

అర్జున: మనిషి తన సంతానం సుఖంగా ఉండాలని శ్రమ పడుతాడు మాధవ, సంతానంవలన సుఖపడాలన్న ఆపేక్ష ఎందుకుండకూడదు?

కృష్ణ భగవాన్: మనిషి తన సంతానంకోసం ఇది చేసిన అది వ్యాపారమా లేక ప్రేమ పార్థ?

అర్జున: ప్రేమ మాధవ...

కృష్ణ భగవాన్: మరి తాను చేసినదానికి ప్రతిఫలం ఆశించడం ఎందుకు పార్థ?
భవిష్యత్తులో లాభంకోసం వ్యాపారంలో ఎదురు చూస్తారు...ప్రేమలో కాదు! ఏ మనిషైతే తన సంతానంయొక్క ప్రవర్తనను తీర్చి తిద్ధి సన్మార్గంలో నడుపుతాడో, తన సంతానం కూడా ఆ మనిషికి ప్రేమ, సంరక్షణ తప్పక అందిస్తారు. సంతానం చూపే ప్రేమ, ఆత్మీయుల ప్రవర్తన వారు చేసే కర్మలు... ఒకరికి మరొకరి కర్మలపై ఎటువంటి అధికారం ఉండదని తెలుసుకో, వారినుంచి ఏదైనా ఆపేక్షించడంవలన ప్రయాజనం ఏమిటి? దీనిని నీవు దీర్ఘంగా ఆలోచించి చూస్తే వెంటనే అర్దమయేది ఏమిటంటే జీవితంలో ఎవరైనా సరే ఏ విషయం గురుంచయినా సరే ఆశలు ఆపేక్షలు పెంచుకోవడం అనివార్యం కాదు.

యావత్ సృష్టిలోనే పరమాత్ముడున్నాడు. మనిషి స్వయాన ఆ పరమాత్ముని అంశ, అప్పుడు లోకంలోని అన్ని పనులు ఆ పరమాత్ముడివే, స్వయంగా మనిషన్నవాడు ఏది చేయలేడు. ఇదే కర్మయోగ మూలసిద్ధాంతం పార్థ. ఇప్పుడు నీవు కూడా కర్మయోగిగా మారి ఈ యుద్ధం చేయక తప్పదు పార్థ. 

|త్రైగుణ్యం విషయావేద నిస్త్రైగున్యో భవార్జున, నిర్ధ్వంధ్వా నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్|

మూడు గుణాలను త్యజించి నిర్గుణుడివైపో పార్థ, ధ్వంద్వ ప్రవృత్తినుంచి ముక్తి లభిస్తుంది. సత్వగుణంతో విరాజిల్లుతూ పరమాత్మునిపై మనస్సుని లగ్నం చేసి నీ కర్తవ్యాన్ని నిర్వాయిస్తూ ఉండు.

అర్జున: నేను నా బుద్దిని పరమాతపై స్థిరంగా ఉంచి, కర్మయోగిగా మారేందుకు మార్గం ఏమిటి మాధవా?

కృష్ణ భగవాన్: పార్థ, సాంఖ్యయోగం వలన మనిషి మరమాత్ముని నిరంతరం స్మరిస్తూ ఉంటాడు. పరమాత్ముని స్మరించడంవలన మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమౌతుంది. అటువంటి భావాన్ని భక్తి అని అంటారు.

భక్తివలన మనిషికి సత్యా అసత్యాల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానంవలన వాడు పరమాత్ముని దర్శించగలుగుతాడు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగ మారగలరు. జన్మల పరంపరనుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మలన్నింటికీ అంతిమ లక్ష్యం అదే. ధర్మంయొక్క అంతిమ చరణం కూడా అదే.

అర్జున: కాని నేను పరమాత్ముని దర్శించకుండ అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను?

కృష్ణ భగవాన్: ఈ సృష్టియే పరమాత్మ... పరమాత్మయే సర్వస్వం... పరమాత్మ కానిదంటూ ఇంకేమి లేదు. ఎవరు తమ ఆత్మను దర్శించగలరో వారే పరమాత్మను దర్శించగలుగుతారు. ఏ విధంగా ఉప్పులోని ఒక కణానికున్న రుచి మహాసముద్రపు నీటి రుచికి భిన్నమైనది కాదో అదే విధంగా నీ ఆత్మను నీవు దర్శించడం పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు...

అర్జున: అంటే మాధవ,,, మీరేనా పరమాత్మ?

కృష్ణ భగవాన్: ఔను పార్థ... నేను పరమాత్మను, నీవు కూడా పరమాత్మవే పార్థ. కాని నీవు ఇప్పటికికూడా జాగృతం కాలేదు. నేను ఈ రహస్యాన్ని తెలుసుకున్నాను...

అర్జున: ఐతే మాధవా,,, మీపట్ల అంకిత భావం ఉంటే ఈశ్వరుని పట్ల అంకిత భావం ఉన్నట్లే కదా? 

కృష్ణ భగవాన్: అవశ్యం... నాపట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మపట్ల ఉన్న అంకిత భావం.....
|సర్వ ధర్మాన్ పరితజ్య మామేకం శరణం వ్రజ | సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్నే ఆశ్రయించు పార్థ.

ఈ సకల లోకాన్ని నేనే, నేను ఈ లోకముయొక్క ప్రతి అణువును. నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని, ఈ నక్షత్రాలన్నీ నేనే. ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే, నేను సూర్యునికంటే ముందునుండి ఉన్నవాడిని, అలాగే ఒక మొక్కపై తొడిగిన మొగ్గకన్నా నవ్యడుని నేను. ఈ మానవులందరు నేనే, నేనే స్వర్గాన్ని, నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని. నేనే ధుర్యోధనుణ్ణి, అలాగే అర్జునుడిని కూడా నేనే.

అర్జున: అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించడం పెద్దలు అనేకులు తమ జీవిత కాలంలో చూసారు. మిము నవ మాసాలు మోసి మీకు జన్మనిఛ్చిన మాత ఇంకా జీవించే ఉన్నారు. మీరు పురాతనంలో నాశనంలేనివారు ఎలా అవుతారు?

కృష్ణ భగవాన్: నీవు శరీరాన్ని చూస్తున్నావు... కాని నేను ఆత్మగురుంచి మాట్లాడుతున్నాను. నేను అనేక జన్మలెత్తాను పార్థ. నేను అనేక అవతారాలను ధరించాను. ఎన్నో శరీరాలతో జన్మించాను నేను. అలాగే ఈ మట్టిలో కలసిపోయాను. ఇక ముందుకూడా పదే పదే జన్మిస్తుంటాను.

|యదాయదాహి ధర్మస్య గ్లానిర్ భవతి భారతః, 
అభ్యుతానమ ధర్మస్య తదాత్మనాం సృజామ్యహమ్|



|పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతం, 
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే|

ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ది చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులును ఉద్ధరించేందుకు అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకు నేను జన్మిస్తుంటాను.. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది అలాగే ఇక ముందును జరగుతుంది.
నేనే నాశనంలేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేను వామన అవతారాన్ని, నేను పరశురామున్ని, నేనే రామావతారం కూడా. నేనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. నేనే సరస్వతి, లక్ష్మి, పార్వతిని కూడా. నేను పురుషుడిని కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను, నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను, నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని, నేను పరబ్రహ్మను, నేనే సర్వస్వాన్ని, అలాగే నేను ఏమి కాను.

|శ్రీ కృష్ణ గోవిందా హరే మురారి హేనాథ నారాయణ హే వాసుదేవ|

ఈ విధంగా ప్రతియుగంలోను జరిగింది. అలాగే ఇక ముందుకూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మ జ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నువ్వు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగ నిన్ను నీవు పరమాత్మ స్వరూపుడిగ గుర్తించగలవు. కాని నీవు ఆ పదాన్ని చేరుకునేందుకు నాపట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి. 

అర్జున: అంకిత భావం అంటే ఏమిటి మాధవ?

కృష్ణ భగవాన్: అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు. అప్పుడు మనిషి తన సంకల్పాలనింటిని త్యాగం చేస్తాడు. స్వయంగా ఏ విధమైన నిర్ణయాన్నిగాని, లేక ప్రతిజ్ఞనిగాని తీసుకోడు. ఏ విధమైన పనులు వానికి నిర్ధేశించారో ఆ విధమైన పనులే చేస్తుంటాడు. వాస్తవానికి అంకిత భావానికి అర్ధమేమిటంటే తమని తాము, తమ మనస్సును, బుద్దిని, జ్ఞానాన్ని, ఇచ్చలును, ఆశలను, మనసులోని భావనలను, తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించడమే. ఇటువంటి అంకితభావాన్ని భక్తి అంటారు.

అర్జున: భక్తితో కొలవడం అంటే ఏమిటి మాధవా? అంకితభావమే భక్తి కాదా?

కృష్ణ భగవాన్: కాదు పార్థ. అంకిత భావం భక్తిలో మొదటి భాగమే, వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యంవంటిది కాదు. అది ఒక మనఃస్థితిని సూచిస్తుంది. నిత్యజీవితంలో మనిషి జపతపాలు, యజ్ఞయాగాలు, యమనియమాలు, యోగం స్వాధ్యాయం అనే మాద్యమాలతో తన అంతరంగాన్ని శుద్ధం చేస్కుని పరమాత్మపట్ల అంకిత భావంతో ఉండాలి. మనిషి తాను చేసే పనులను, తన కర్మల ఫలితాన్ని జీవితంలోని ఉచ్వాస నిశ్వాసాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి.

అర్జున: భక్తి కేవలం మనఃస్థితి ఐతే జపాలు తపాలు ఇత్యాదుల అవసరం ఏంటి మాధవా?

కృష్ణ భగవాన్: ఈరోజు శుభ్రం చేసిన పాత్ర ఎలా మళ్ళీ మలినం అవుతుందో అదే విధంగా మనిషి మనస్సు పదే పదే పరమాత్మకు విముఖమైపోతుంది అందుకే అవి అవసరం. ఈ జపతపాలు స్వాధ్యాయం ఇత్యాదుల మాధ్యమం ద్వారా మనిషి నిరంతరం తమ జీవితాన్ని ఆ పరమాత్మకే అంకితం చేసానని గుర్తు చేసుకుంటాడు. ఏ వడ్డున మునక వేయాలన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం. భక్తియోగ సారం ఒక్కటే పార్థ. మనిషి తన జీవితాన్ని పరమాత్మకి అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి. అలాగే సత్వగుణ సంపదను పదిలంగా దాచుకోవాలి.

అర్జున: సత్వగుణ సంపద అని దేనిని అంటారు మాధవ?

కృష్ణ భగవాన్:

|అహింస, సత్యం, క్రోధత్స్యాగ శాంతిహి పైశునం, దయా భూతేశ్వ లోలత్వ మార్ధ్వవం ఐరచాపలం,
తేజ క్షమాదృతి అనితః భవంతి సంపదం దైవీం అభి జాతస్య భారతః|

అకారణంగా సదా స్వార్థం కోసం హింసను చేయడం అధర్మం పార్థ. వాస్తవానికి అహింసయే పరమ ధర్మము, అహింసతో పాటు సత్యం, క్రోధం చెందుకుండడం, త్యాగం, మనఃశాంతి, నిందించుకుండడం. దయాభావం, సుఖానికి ఆకర్శితుడు కాకుండడం, అకారణంగా ఏ కార్యము చేయకుండడం, తేజం, క్షమా, దైర్యం, శరీర శుభ్రత, ధర్మానికి ద్రోహం చేయకుండడం, అహంకారం లేకుండ ఉండడం. ఈ గుణాలన్నిటిని సత్వగుణ సంపద లేక దైవీక సంపదలని అంటారు. వీటివలననే మనిషి పరమాత్మను అంటే నన్ను భక్తితో కొలుస్తాడు. తన జీవిత కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. ధర్మ సంస్థాపన చేయగలడు అలాగే కర్మ ఫలానికై ఆశను త్యాగం చేసి జీవిస్తాడు. వానికి నేను నిస్సందేహంగా ఈ జన్మలో ఆనందాన్ని అందిస్తాను, మరణించిన పిమ్మట వానిని నాలో ఐక్యం చేసుకుంటాను.

|నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్త్తమం, 
దేవిం సరస్వతిమ్ వ్యాసం తథోజాయం ఉదీరయేత్|

అర్జున: మీ వాస్తవ స్వరూపాన్ని నాకు దర్శించాలని ఉంది మాధవ, తమ శక్తి, తమ జ్ఞానం, తేజం, ఐశ్వర్యంతో కూడిన పరమాత్మ స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించాలని ఉంది మాధవ. ఆధ్యంతాలు లేని మీ స్వరూపాన్ని నాకు దర్శనంమివ్వండి మాధవ, నా మనస్సులోని సందేహాలన్నిటిని తొలగించండి. మీ దర్శనం ఇవ్వండి మాధవ...

కృష్ణ భగవాన్: దర్శించు పార్థ..... 


 | ఓం బ్రహ్మణే నమః, ఓం నమః శివాయ, ఓం విష్ణువే నమః |

| ఓం నమో భగవతే వాసుదేవాయ |
 
నేనే సత్యము, నేనే సంపూర్ణడును, నేనే జీవుడిని, నేనే శివుడిని, అక్షరాలలో అకారాన్ని, వేదాలలో సామవేదాన్ని, దేవతల్లో ఇంద్రుడిని, ప్రాణులలో చైతన్యాన్ని, యక్షులలో కుబేరుడిని, రుద్రలలో శంకరుడిని, వసువులలో అగ్నిని, పర్వతాల్లో సుమేరుడిని, అలాగే ఋషిలలో భృగువుని. ద్వనులలో ఓంకారాన్ని, యజ్ఞాల్లో జపాన్ని, వృక్షాలలో అశ్వత్తవృక్షాన్ని, బుద్దిలోని స్మృతి, మేధా, దృతి, అలాగే క్షమా నేనే అయ్యున్నాను. కీర్తిని నేనై ఉన్నాను, గంధర్వలలో చిత్రరథుడను, దేవర్షలలో నారదుడిని, నేను మునులలో కపిలడుని, అశ్వములలో ఉఛ్వైశాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని, పశువులలో సింహాన్ని, పక్షులలో గరుడాన్ని, మనుష్యులలో రారాజున్ని, శస్త్రాల్లో వజ్రాయుదాన్ని, గోవులలో కామధేనువుని, సర్పాలలో వాసుకిని, శేషనాగును, యమరాజును, వరుణదేవుడిని, అలాగే వాయువుని కూడా నేనే అయ్యున్నాను, శ్రీ రామచంద్రుడుని, పవిత్ర గంగానదిని, సృష్టిలో ఆదిమధ్యాంతములలో నేనే ఉన్నాను, బ్రహ్మవిద్యను, మహాకాళుడిని, అలాగే బ్రహ్మను, ప్రభావాన్ని, విజయాన్ని, సత్వాన్ని, నిశ్చయుడిని, దండన, శక్తి, నీతి, మౌనం, అలాగే తత్వజ్ఞానాన్ని, కూడా నేనే అయ్యున్నాను.

వాసుదేవుడను, అర్జునుడను, వేదవ్యాసుడను, నేను కానిదంటు వేరొకటి లేనే లేదు. విశ్వలో నేను లేని స్థానం అన్నది ఏది లేదు. నేనే కాలాన్ని, అలాగే నేనే జీవితాన్ని, మృత్యువుని కూడా. ఇక్కడికి వఛ్చిన వీరందరికి మృత్యువుగా మారి నిలిచి ఉన్నాను, నీవు శస్త్రాన్ని సంధించకున్న, అప్పుడు కూడా నేను వీరందరిని వధించగలను. కనుక నీ మొహాన్ని త్యజించు. నీ ప్రస్తుత కర్తవ్యాన్ని దర్శించు... ధర్మ భారాన్ని వహించు... గాండీవాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు.

యుద్ధం చేయి అర్జున యుద్ధం చేయి...!

అర్జున: హే మాధవ, హే మధుసూధన, ఈరోజు నా మనసులోని సందేహాలన్నీ నశించాయి. కృపతో మీరు మనుష రూపాన్ని ధరించండి. మీ ప్రతి ఆదేశాన్ని శిరసా వహిస్తాను.


కరిష్యే వచనం తవా !!!


జై సాయి రాధేగోవింద

ప్రేమతో జపించండి:

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

ఆనందించండి.

మీ మురళి సాయి 
 

1 comment:

  1. Mee okka aashayam chaala mandhi
    Choosi Telusukuni aacharinchaalani aa swamy dhaggara korukuntunna

    Mee blog chaala baagundhi
    Sai bless you.

    ReplyDelete